రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ
Metro Mat News ( Jairaju AP ) అమరావతి, జులై 4: రాష్ట్రంలో ఉన్న 20 పట్టణాభివృద్ది సంస్థల పరిధిలో మౌలిక వసతులను మెరుగు పర్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ మేరకు సంబందిత సంస్థల అధికారులతో నేడు సమీక్ష నిర్వహించి వాటి ఆర్థిక స్థితిగతులు, మౌలిక వసతుల మెరుగుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థలు (Urban Local Bodies) ఉన్నాయని, వీటిలో మండపేట మున్సిపాలిటీ మినహా మిగిలిన 122 పట్టణ స్థానిక సంస్థలు పట్టణాభివృద్ది సంస్థల పరిధిలో వస్తున్నాయని, ఇవి అన్నీ రాష్ట్ర విస్తీర్ణంలో 85 శాతం మేర విస్తరించి ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఒక సిఆర్డిఏ మరియు 20 పట్టణాభివృద్ది సంస్థలు ఉన్నాయని, వాటి పరిధిలో ఉండే లేఅవుట్లలో విద్యుత్, రోడ్లు, త్రాగునీరు, పార్కులు, మురుగునీటి పారుదల వ్యవస్థలు ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే ఆయా సంస్థల నిధులను కూడా గత ప్రభుత్వం డైవర్టు చేసి పలు రకాలుగా వినియోగించుకోవడం వల్ల లేఅవుట్లలో మౌలిక వసతులు మెరుగు కాకపోవడమే కాకుండా ఆయా సంస్థలు నిర్వీర్యం అయ్యే దశకు చేరుకున్నాయన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పట్టణాభివృద్ది సంస్థల పునరుత్తేజానికి, పనితీరును మెరుగు పర్చే విధంగా పలు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. నెల్లూరు, కడప లేఅవుట్లలో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించి విచారణా కమిటీని వేయడం జరిగిందని, ఆ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే అవకతవకలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.