భవిష్యత్తులో ప్రజా పంపిణీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళణ చేస్తాం
Metro Mat News ( Jairaju AP ) దేశంలో ఎక్కడా జరగని విధంగా గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని మాజీఎమ్మెల్యే కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మాజీ ఎమ్మెల్యే కుటుంబం బియ్యం మాఫియాను పెంచి పోషించిందన్నారు. వారం రోజుల్లో రూ. రూ.159 కోట్లు విలువైన 35,404 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని చెప్పారు. పేదల పొట్ట కొట్టి.. కోట్లు దోచుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వ్యవస్థ ప్రక్షాళన జరిగే వరకు తనిఖీలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ప్రతి జిల్లాలో తనిఖీలు చేపట్టి బియ్యం మాఫియాను నిర్మూలిస్తామని అన్నారు. గత అరాచక పాలనలో రైతులు చితికిపోయారని, రైతుల నుంచి సేకరించిన ఆహారధాన్యాలకు సకాలంలో బిల్లులు చెల్లించలేదని అన్నారు. రైతుల బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రూ. 1000 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. గురువారం, విజయవాడ కానూరులోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో శ్రీ మనోహర్ గారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “ఐదేళ్ల గత దురాగత పాలనలో రైతులు అన్ని విధాలా చితికిపోయారు. పంట పండించి నలుగురికీ అన్నం పెట్టే రైతుని నిస్సహాయ స్థితిలోకి గత ప్రభుత్వం, నాయకులు నెట్టేశారు. ఏటా కన్నీటితో బకాయిల కోసం ఎదురుచూపులు చూసే దుస్థితికి తెచ్చారు. రైతుల వద్ద కొన్న ఆహార ధాన్యాలకు చెల్లించాల్సిన మొత్తం పూర్తిగా బకాయిలు పెట్టి రైతు ధైర్యం కోల్పోయేలా చేశారు.
• రూ.36 వేల కోట్లు అప్పులు చేశారు
• ఏ జిల్లాకి ఎంత..
పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.565.95 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.121.96 కోట్లు, కోనసీమ జిల్లాకు రూ.163.59 కోట్లు, కాకినాడ జిల్లాకు రూ.21.92 కోట్లు, ఏలూరు జిల్లాకు రూ.19.96 కోట్లు, బాపట్ల జిల్లాలో రూ.6.61 కోట్ల చొప్పున చెల్లించనున్నాం. సుమారు 50 వేల మంది రైతులకు ఉపశమనం కలిగేలా చర్యలు చేపట్టాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో స్పందించబట్టి రైతులకు తక్షణ సాయం అందచేయగలుగుతున్నాం. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ రైతు సంక్షేమానికే మా ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని గుర్తించాలి. రైతులకి మిగిలిన బకాయిలు కూడా కొద్ది రోజుల్లో చెల్లిస్తాం. దీంతోపాటు మరో రూ.2 వేల కోట్ల బకాయిలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి కూడా ఇటీవలే చెల్లించాము. వచ్చే మార్చి 31 నాటికి మరో రూ. 10 వేల కోట్లు బకాయిలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. బ్యాంకుల నుంచి కూడా సహాయం కోరుతున్నాం.
• తూకంలో తేడా వద్దు.. నాణ్యత తగ్గొద్దు..
ఒక మార్పు తీసుకురావాలని మేము చేస్తున్న ప్రయత్నంలో ప్రతి ఒక్కరి సహకారం అవసరం. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే బియ్యం, నిత్యవసర సరుకులు కచ్చితంగా నాణ్యతతో ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టబోతున్నాం. తూకంలో తేడా వచ్చినా, సరుకు పక్కదోవ పట్టించాలని చూసినా ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదు. సమీక్షా సమావేశం అనంతరం ఈ నెల 251 స్టాక్ పాయింట్స్ లో తనిఖీలు జరిగాయి. జిల్లా యంత్రాంగం కూడా పంపిణీ సక్రమంగా చేస్తున్నారా లేదా చూడాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రతి కార్డు దారుడికి బియ్యం చేరవేసే కార్యక్రమం చేపట్టాలి. రాబోయే రోజుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో మరిన్ని మార్పులు తీసుకువస్తాం. మా ప్రభుత్వం చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో నిజాయితీ ఉంటుంది. పారదర్శకంగా విలువలతో కూడిన రాజకీయాలతో ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో కష్టపడి పని చేస్తున్నాం. వ్యవస్థల్లో ఉన్న వారు కూడా ఆ మార్పు చూపాలి. అంతా నిజాయితీగా పని చేయాలి.
• ఫుడ్ మాఫియాని ఉపేక్షించం
గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అక్రమ బియ్యం ఎగుమతులపై తనిఖీలు జరిపాము. కాకినాడ పోర్టులో రూ.159 కోట్ల విలువైన 35,404 మెట్రిక్ టన్నులు అక్రమంగా నిల్వ చేసిన ధాన్యాన్ని సీజ్ చేశాం. రాష్ట్రంలో ఎన్నడూ ఇలా జరిగి ఉండదు. ఫుడ్ మాఫియాని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. రేషన్ మాఫియాని వ్యవస్థీకరించిన తీరు కాకినాడ పర్యటనలో చూశాము. పోర్టు సమీపంలో గోడౌన్స్ లో ఈ మొత్తం సీజ్ చేశాము. మొట్టమొదటి సారి గోడౌన్ లోకి అధికారులు వెళ్లి తనిఖీలు చేశారు. ఈ తనిఖీలు రాబోయే రోజుల్లోనూ కొనసాగుతాయి. నెల రోజుల్లో మార్పు తీసుకువస్తామని మేము భరోసా ఇస్తున్నాం. కేంద్రం ఇస్తున్న మొత్తం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి కిలో బియ్యం రూ.45.33కి ఖర్చు చేసి లబ్దిదారుడికి రూపాయికి అందిస్తుంటే, దాన్ని రూ.7కి కొని స్కాములకు పాల్పడుతున్నారు. ప్రజలు ఈ స్కాముల్లో భాగస్వాములు కావద్దు. ప్రభుత్వం ఇచ్చే కానుకని గౌరవించండి. దోపిడీకి పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. మాజీ ఎమ్మెల్యే కుటుంబం చేసిన అవినీతి మామూలుగా లేదు. రేషన్ మాఫియాని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. ఆ నెట్వర్క్ కట్ చేయాలి. రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటాం. కార్పోరేషన్ కి రూ.1500 కోట్లు ఆర్ధికంగా నష్టపరిచే విధంగా 9,260 ఎం.డి.యూ. యూనిట్లు కొన్నారు. ప్రభుత్వ మూర్ఖపు నిర్ణయంతో కార్పోరేషన్ కి వేల కోట్ల నష్టం వాటిల్లింది. వీటిని కొనసాగించాలా లేదా అన్నది అందరితో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామ’న్నారు.