గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసింది..మళ్లీ వ్యవస్థలు గాడిన పడాలి ---సిఎం నారా చంద్రబాబు నాయుడు
Metro Mat News ( jairaju AP )అమరావతి:-రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాగులో వ్యవసాయ శాఖ సన్నద్దతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో సాగు, పంటలకు నీటి విడుదల అంశాలపై అగ్రికల్చర్, ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి వనరులను సక్రమంగా నిర్వహించి సాగునీటి కొరత అనేది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. • సమీక్షలో అధికారులు సాగునీటి విడుదల ప్రణాళికను ముఖ్యమంత్రికి వివరించారు. గోదావరి డెల్టాకు జూన 1 నీరు విడుదల చేశామని...ఈ రోజు పట్టిసీమ, పుష్కర, తాటిపూడి, పురుషోత్తం పట్నం ద్వారా నీటి విడుదల మొదలుపెట్టినట్లు తెలిపారు. పులిచింతలలో నీటి లభ్యత లేదని....పట్టిసీమ ద్వారా వచ్చే నీటి ద్వారానే కృష్ణా డెల్టాకు సాగునీరు ఇస్తామని తెలిపారు. ఈ సీజన్ లో వర్షాలు బాగున్నాయని జూన్ నెలలో హీట్ వేవ్ ఉన్నా...ప్రస్తుతం వర్షాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయని చెప్పారు. 45 మండలాల్లో మాత్రమే వర్షపాతం లోటు ఉందని...రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సరాసరి 50 శాతం అదనపు వర్షపాతం నమోదు అయ్యిందని వివరించారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 4,14,490 లక్షల ఎకరాలు సాగు జరగాల్సి ఉండగా 3,04,604 ఎకరాల సాగు జరిగిందని తెలిపారు.
• అనంతరం సిఎం చంద్రబాబు నాయుడు అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ విధానాల కారణంగా సాగు భారంగా మారిపోయిందని సిఎం అన్నారు. దేశంలో ఎక్కువ అప్పులు ఉండే రైతులు ఎవరంటే మన రైతన్నలే అనే పరిస్థితి వచ్చిందని సిఎం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సబ్సిడీలు, పాలసీల ద్వారా సాగుఖర్చులు తగ్గాలని సిఎం అన్నారు. గతంలో క్రమం తప్పకుండా సాయిల్ టెస్ట్ లు నిర్వహించి, రైతులకు పోషకాలు అందిoచే వాళ్లమని అన్నారు. అలాగే సీమ వంటి కరువు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డ్రిప్ సబ్సిడీలు ఇచ్చామని..ఇలా రైతులకు మంచి చేసే అన్ని పథకాలను గత ప్రభుత్వం రద్దు చేసిందని సిఎం అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేశారని..కనీసం గేట్లకు గ్రీజు కూడా రాయలేదని అన్నారు. ఈ మొత్తం పరిస్థితి మారాలని,ప్రాజెక్టుల నిర్వహణ, నీటి నిర్వహణలో మళ్లీ ఉత్తమ విధానాలు అమలు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. నాడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ ను మూలనపడేశారని...మళ్లీ రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలని సిఎం సూచించారు.డ్రోన్లతో పురుగు మందుల పిచికారీ పై అధ్యయనం చేయాలని...రైతులకు వాటిపై అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే పంటలకు అధికంగా పురుగు మందులు కొట్టే విధానాలకు స్వస్తి పలకాలని....ఏ తెగులుకు ఏ మందు కొట్టాలి అనే విషయంలో అధికారులు రైతులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. పంట కాలువల్లో 5 ఏళ్ల కాలంలో పూడిక కూడా తీయని దుస్థితి నెలకొందని.....అన్ని పంట కాలువల్లో గుర్రపుడెక్క తొలగించాలని ఆదేశించారు. కృష్ణా నదీ నీటిని రాయలసీమకు ఎక్కువ ఉపయోగించి.....వృధాగా పోయే గోదావరి వరద నీటిని సద్వినియోగం చేసుకుని కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వాలని సిఎం అధికారులకు సూచించారు. మళ్లీ పాత విధానంలో క్రాప్ ఇన్స్యూరెన్స్ తీసుకురావాలని అధికారులకు సూచించారు. రైతు భాగస్వామ్యంతో ఇక పంటల బీమా విధానం కొనసాగుతుందని చంద్రబాబు చెప్పారు. గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ఆక్వాలో 29 శాతం గ్రోత్ తీసుకువస్తే...వైసీపీ ప్రభుత్వంలో అది 13 శాతానికి తగ్గిపోయిందని సిఎం అన్నారు. అలాగే హార్టికల్చర్ లో 17 శాతం వృద్ది ఉంటే...గత పాలకుల అసమర్థత వల్ల అది కూడా తగ్గిపోయిందని ముఖ్యమంత్రి అన్నారు. అక్వా, హార్టికల్చర్ కు ప్రభుత్వంలో ఇక మరింత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులకు మళ్లీ భరోసా కల్పించేలా అధికారులు పనిచేయాలని సిఎం అన్నారు. ఐఏఎస్ అధికారులు సైతం సచివాలయం నుంచి పొలాలకు వెళ్లాలని...రైతులతో నేరుగా మాట్లాడాలని అన్నారు. అన్నదాతలకు అవసరం అయిన సూచనలు చేసి కొత్త సాగువిధానాలపై వారికి అవగాహన కల్పించాలని సిఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు.