అప్రమత్తంగా ఉండండి, భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష..
Metro Mat News JAYARAJU AP :-
• 8 జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులపై ఆరా..
• వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం..
• ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్ ను స్వయంగా పరిశీలించిన మంత్రి అనిత..
• ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్ విధులను మంత్రి అనితకు వివరించిన అధికారులు..
*కలెక్టర్లు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్..*
అధిక వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి అనిత సమీక్షించారు. తుఫాను ప్రభావంతో నదీపరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగుల ద్వారా గోదావరి, వంశధార, నాగావళి తదితర నదుల్లోకి వరద నీరు చేరుతోందని అన్నారు. వర్షాలు, వరదలపై ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు కలెక్టర్ శ్రీ ఎ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ.. వారం రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయన్నారు. వర్షాలు, తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో దేవీపట్నం నదీపరివాహక ప్రాంతంలో వీఆర్వో, వీఆర్ఏలతో పాటు ఇతర అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు కూడా తీసుకున్నారని తెలిపారు. దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారని, సహాయక చర్యల నిమిత్తం గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్, శ్రీకాకుళం జిల్లా డీఆర్వోలు మాట్లాడుతూ.. అధిక వర్షాల నేపథ్యంలో అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకున్నామని, ఎక్కడా కూడా ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి అనిత స్పందిస్తూ.. అధికారులు అలర్ట్ గా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
*రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్ శ్రీ రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ..* భారీ వర్షాల వల్ల సంభవించే పరిస్థితులపై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎగువ ప్రాంతాలైన నాసిక్, భద్రాచలం వంటి ప్రాంతాల్లో వర్షాలు, వరదల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. గొట్టా బ్యారేజీ వంటి తదితర వరద ప్రభావిత ప్రాంతాల్లో తహశీల్దార్లు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
*ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్ పరిశీలన..*
స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ ను మంత్రి అనిత స్వయంగా పరిశీలించగా 24/7 వాతావరణాన్ని పర్యవేక్షించే విధానాన్ని అధికారులు మంత్రికి వివరించారు. వాతావరణ పరిశోధన విభాగాలలోని వివిధ అంశాలను తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. విపత్తుల సమయంలో నిరంతరం పర్యవేక్షిస్తూ అలర్ట్స్ పంపే విధానాన్ని అధికారులు మంత్రికి విశదీకరించారు. కామన్ అలెర్ట్ ప్రోటోకాల్ , ఏపీ అలెర్ట్ సెంటర్ ద్వారా ప్రజలకు హెచ్చరిక సందేశాలు ఏవిధంగా చేరుతాయో ప్రత్యక్షంగా చూపించారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శాటిలైట్ ఫోన్స్, శాటిలైట్ బేస్డ్ మొబైల్ డేటా వాయిస్ టెర్మినల్ (SBMDVT), వాకీటాకీ, వి-శాట్ కమ్యూనికేషన్ వ్యవస్థల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు, సిబ్బంది పనితీరును మంత్రి ప్రశంసించారు. అనంతరం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును మంత్రి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విపత్తుల నిర్వహణ శాఖ ఈడీ శ్రీ సి.నాగరాజు, సంస్థ అధికారులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.